26/08/2020
పాపి కొండలు పర్యాటకానికి ఆద్యుడు:
శ్రీ కైగాల సత్యనారాయణ గారు ఇక లేరు!
అవును మిత్రులారా!
పాపి కొండలు కొల్లూరు బ్యాంబూ రిసార్ట్ వ్యవస్థాపకులు శ్రీ కైగాల సత్యనారాయణ గారు ఆగస్ట్ 22 వ తేదీ రాత్రి కన్ను మూశారని తెలపడానికి విచారిస్తున్నాను. వరదల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేక ఆయన మరణ వార్త ఒక రోజు తర్వాతనే మాకు చేరింది. "ఇక్కడ చనిపోయినా బైటి వారికి ఎవరికీ తెలియదని" ఒకప్పుడు ఆయనే అన్న మాట గుర్తు వచ్చింది. ఆయన వయసు 80. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పాపికొండలు లో పర్యాటకానికి శ్రీకారం చుట్టి దాన్ని ఒక స్థాయికి తీసుకు రావడానికి విశేష కృషి చేసిన వ్యక్తి శ్రీ కైగాల సత్య నారాయణ గారు. పాపి కొండలు టూరిజం పై ఆధార పడి ఈ రోజు వందలాది మంది స్థానికులు ఉపాధి పొందుతున్నారంటే దానికి కారణం ఆయనే! పాపి కొండలు విహారానికి వెళ్లి ఒక్క రాత్రయినా కొల్లూరు లో మకాం చేశారా? అలా మకాం ఉంటే కైగాల సత్యనారాయణ గారు, ఆయన సతీమణి జయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు చూపే ఆదరణ, వారి అపురూప ఆతిథ్యం జీవితం లో మరిచిపోలేరు. ఒక్కసారి వారి ఇంటికి వెళ్తే చాలు పదేపదే వెళ్ళాలని అన్పిస్తుంది. అంత గొప్ప మనసున్న మనుషులు వాళ్ళు. అందర్నీ ఆప్యాయంగా అక్కున చేర్చుకునే ఒక ఆత్మీయ స్పర్శ వారిలో స్పష్టంగా కనిపించేది.
పాపి కొండల సౌందర్యం:
ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ల మధ్య ప్రవహించే గోదావరి నది వయ్యారం పాపి కొండల మధ్య చూసి తీరాల్సిందే!ఎడా పెడా ఎత్తయిన కొండల మధ్య నది ఒంపులు తిరుగుతూ, సుడులు తిరుగుతూ సముద్రం వైపుగా వేగంగా పరుగులు తీస్తుంటుంది. పాపికొండల నడుమ నది వెడల్పు తక్కువ కావడం తో లోతూ, వడీ ఎక్కువ ఉంటుంది. కొండ చరియ లలో పచ్చదనం పరచుకున్న దట్ట మైన అడవులు, వెదురు పొదలు విస్తారంగా ఉంటాయి. నదీతీరం లో అక్కడక్కడ విశాలమైన తెల్లటి ఇసుక తిన్నెలు కను విందు చేస్తుంటాయి. ఎవరో నిర్లక్ష్యంగా విసిరేసినట్లు గా తారసిల్లే గిరిజన గ్రామాలు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులు. తీర భూముల్లో మిరప, మొక్క జొన్న, నాటు పొగాకు పంటలు. ఖమ్మం జిల్లా పోచవరం నుండి తూర్పు గోదావరి జిల్లా రాజ మండ్రి వరకూ గోదావరి లో ప్రయాణం చేసే వారికి నది కి ఇరువైపులా కనిపించే దృశ్యాలు అద్భుత మైన రసానుభూతి ని కలిగిస్తాయి. పాపి కొండలు లో ఏడాది లో ఎనిమిది నెలల పాటు చల్లని ఆహ్లాద కరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. mఅందుకే దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని అంటూ ఉంటారు.
పాపి కొండల పర్యాటకం లో కొల్లూరు కు కీలక ప్రాధాన్యం వుంది.
గోదావరి మలుపు తిరిగే ఆ ప్రాంతం లోనే మారేడు మిల్లి అడవుల నుండి ప్రవహించే పాములేరు వాగు వచ్చి గోదావరిలో కలుస్తుంది. అక్కడ వాగుకు, గోదావరి నదికి ఒక మూల కొండ వాలు పై ఒదిగి కొల్లూరు గిరిజన కుగ్రామం ఉంటుంది. పాములేరు గట్టున పెద్ద దిబ్బ మీద సత్యనారాయణ గారి ఇల్లు ఉంది.వరదల్లో మునిగే ప్రమాదం ఉన్నందున వెదురు కర్రలతో నిర్మించిన తాత్కాలిక గృహమే అది.వచ్చే అతిథుల కోసం ఆ తర్వాతి కాలంలో లో ఒక బంగళా పెంకుటిల్లు కట్టారు.వారి ఇంటి నుండి చూస్తే మలుపు తిరిగే గోదావరి, మూడువైపులా కొండలు ఎంతో అందంగా కను విందు చేస్తుంటాయి.ఇంటి గుమ్మం లోనే వేలాడదీసిన బైనాక్యులర్లు, చిన్న పాటి టెలీస్కోప్ ఉంటాయి. ఒక ఫర్లాంగు దూరం లో ఉన్న రేవులో ఆగే లాంచీలు స్పష్టంగా అందులో కనిపిస్తాయి. వచ్చే వారెవరో వారికి ముందే తెలుస్తుంది. ఖమ్మం జిల్లా నుండి డౌన్ స్ట్రీమ్ లో వచ్చే టూరిస్ట్ లాంచీలు కొల్లూరు వరకూ వస్తాయి. అక్కడ రాత్రి మకాం చేసి మర్నాడు కొల్లూరు నుండి వెనక్కి తిరుగుతాయి. రాజమండ్రి నుంచి అప్ స్ట్రీమ్ లో వచ్చే లాంచీలు కొల్లూరు కు కొద్దిగా ఎగువన ఉన్న పేరంట పల్లి వరకూ వెళ్లి అక్కడ స్వామి బాలానంద ఆశ్రమాన్ని దర్శించుకుని, వెనక్కి తిరిగి కొల్లూరు వచ్చేస్తాయి. అక్కడే రాత్రి మకాం వేస్తాయి. మర్నాడు రాజమండ్రికి తిరుగు ప్రయాణం చేస్తాయి. ఆ రకంగా కొల్లూరు కు గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేసాయి.
కైగాల వారి ప్రస్థానం:
మనందరికీ తెలిసింది కైగాల సత్యనారాయణ గారే. ఆయన తండ్రి పేరు రామారావు. వారి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావి పాడు. ధాన్యం వ్యాపారం చేసే వారు. అప్పట్లో కమిషన్ వ్యాపారులు, కొందరు మిల్లర్లు చేసిన మోసాలతో రామారావు గారు తీవ్ర నష్టాలు చవి చూశారు. రామారావు గారు బతుకు తెరువు వెతుక్కుంటూ పాపి కొండలు లోని పేరంటాల పల్లి వద్ద ఉన్న బాలా నంద ఆశ్రమానికి వెళ్ళారు. ఆ తర్వాత 1930 ప్రాంతం లో కొల్లూరు లో స్థిర పడ్డారు. కలప, వెదురు, అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేపట్టారు. ఆయన భార్య పేరు కాంతమ్మ. వారికి 1940 లో ప్రథమ సంతానంగా సత్యనారాయణ గారు జన్మించారు. ఇద్దరు తమ్ముళ్ళు, నలుగురు చెల్లెళ్ళు ఉన్న పెద్ద కుటుంబం అది. కొల్లూరు లో గిరిజన ప్రాథమిక పాఠశాల ఉండేది. అందువల్ల చదువు అక్కడితో నే సరి. మిగిలిన తోబుట్టువులు అంతా వివాహాల తర్వాత బైట ప్రపంచానికి వచ్చేసారు. సత్యనారాయణ గారు మాత్రం తండ్రిగారి వ్యాపారాన్ని చేపట్టి కొల్లూరు లో వుండిపోయారు. వారికి బైటి ప్రపంచంతో సంబంధం కల్పించేది వారానికి ఒక సారి వచ్చే లాంచీ మాత్రమే! చిన్న, చిన్న గృహావసర వస్తువులు, ఉత్తరాలు, మందులు వంటి వాటికి ఆ లాంచీ మాత్రమే ఆధారం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామానికి చెందిన జయలక్ష్మి గారితో ఆయనకు వివాహం అయ్యింది. వారికి నలుగురు కుమారులు ఒక కుమార్తె. పిల్లలు మాత్రం బైటికి వచ్చి చదువుకున్నారు. కలప వ్యాపారం, చిన్న చిన్న ఫారెస్ట్ కాంట్రాక్టులు చేస్తూ వారి జీవనం గడుపు కొనే వారు.
ఆతిథ్యం ఒక ఆనవాయితీ:
పేరంట పల్లి బాలానంద ఆశ్రమానికి వచ్చే భక్తుల్లో బంధువులు ఉంటే వారు కొల్లూరు లో దిగి సత్యనారాయణ గారి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళేవారు. ఆ రోజుల్లో డ్యూటీ పై గోదావరి లో బోట్ ప్రయాణం చేస్తూ వచ్చే ఫారెస్ట్, ఐ.టి.డి.ఎ, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఎక్సైజ్, ఫిషరీస్, హెల్త్, వంటి శాఖల అధికారులకు దారి పొడవునా తినడానికి ఏమీ దొరికేది కాదు. కనీసం తాగడానికి టీ చుక్క కూడా దొరికేది కాదు. వారందరికీ కొల్లూరు లో కైగాల సత్యనారాయణ గారి ఇంటిలోనే చక్కని ఆతిథ్యం లభించేది. బాపు గారి దర్శకత్వం లో అక్కినేని హీరోగా రూపొంది 1973 లో విడుదలైన "అందాల రాముడు" సినిమా లో గోదావరి నదీ ప్రయాణం లోని అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. అప్పట్లో పాపికొండలు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆనోటా ఈనోటా పాపికొండల సీనిక్ బ్యూటీ గురించి బైటి ప్రపంచానికి 80 వ దశకం తర్వాతనే తెలియడం మొదలయ్యింది. అప్పట్లో రాజమండ్రి - కూనవరం మధ్య సరకు రవాణా లాంచీలు మాత్రమే తిరిగేవి. వారానికి ఒక సారి ప్రయాణికుల లాంచీ ఒకటి కూనవరం వరకూ వెళ్ళేది. గిరిజన గ్రామాల మధ్య రాకపోకలు నాటు పడవల లో, నావల్లో జరిగేవి. చిలకలూరి పేట ఏ.ఎం.జి. సంస్థ వారి "ఫార్ కార్నర్స్" పేరుగల మెడికల్ బోట్ గిరిజనులకు ఉచిత వైద్య, ఆరోగ్య సేవల కోసం పాపి కొండల మధ్య గోదావరిలో సంచరిస్తూ ఉండేది. భద్రాచలం లో శ్రీరామ నవమి ఉత్సవాలకు రాజమండ్రి నుండి వెళ్ళేవారు కొందరు ఆ రోజుల్లో నదీ ప్రయాణం చేసే వారు. అది మూడు రోజులు పట్టేది. అయితే భద్రాచలం వెళ్ళడానికి ఆర్టీసి బస్ వచ్చాక నదీ ప్రయాణం తగ్గింది. అలాగే పేరంటపల్లి బాలానంద ఆశ్రమానికి, గండి పోచమ్మ గుడి కి, భక్తులు, దేవీ పట్నం సంతకు గిరిపుత్రుల రాక పోకలు ఉన్నా వాటికి పర్యాటక స్వభావం లేదు. చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే పర్యాటకుల రాకపోకలు మెల్లిగా మొదలయ్యాయి. సొంత చొరవతో ఎవరికి వారు ఒక లాంచీ ని బుక్ చేసుకుని వెళ్లి వస్తూ ఉండేవారు.లాంచీల సంఖ్య పెరిగింది. అవన్నీ విరామం కోసం కొల్లూరు లో ఆగేవి. వారికి కైగాల వారే అక్కడి బడి లో బస ఏర్పాటు చేసేవారు. తిండి, పాలు, నీళ్ళు ఇస్తూ ఉండే వారు. 1984 నుండి తాడేపల్లి గూడెం పట్టణ ప్రముఖులు కర్రి సీతారామయ్య, కర్రి రామచంద్ర రావు, ప్రభాకర బాలాజీ, ఆరాధ్యుల శ్రీరామ చంద్ర మూర్తి, నీలం సూర్యనారాయణ, యడ్లపల్లి బాబ్జీ, గారపాటి సత్యనారాయణ వంటి వారు ప్రతి ఏటా పాపికొండలు పర్యటనకు వెళ్ళడం ప్రారంభించారు. వారు కొల్లూరు లో కైగాల సత్యనారాయణ గారి ఇంటి వద్దనే మకాం ఉండేవారు. వారు 70 మంది ఒక బృందంగా వెళ్ళేవారు. యాత్రీకులు అవసరమైన వన్నీ తీసుకు వెళ్లి తమ వంటా వార్పూ తామే చేసుకునే వారు. వీరికి అవసరమైన స్థానిక సహకారం సత్యనారాయణ గారు అందిస్తూ ఉండేవారు. ఆ తర్వాతి సంవత్సరాలలో కర్రి వారి బృందం తో తాడేపల్లి గూడెం ఆంధ్ర పత్రిక విలేఖరి కొండ వీటి త్రినాధ్ కూడా కలిశారు. ఆయన అప్పట్లో పాపి కొండలు పర్యటన అనుభవాలను ఆంధ్ర పత్రికలో రాశారు. " ఆంధ్ర కాశ్మీర్ పాపి కొండలు" శీర్షికతో ప్రచురితం అయ్యింది. ఆ తర్వాత కాలం లో అదే బృందం తో అప్పటి ఈనాడు రిపోర్టర్ కట్రెడ్డి రామకృష్ణ కూడా వెళ్ళారు. కర్రి వారి బృందం క్రమం తప్పకుండా పదేళ్ల పాటు ప్రతి ఏటా పాపి కొండలు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మాత్రం వారు వెళ్ళ లేక పోయారు. 1986 నుండి జయలక్ష్మి గారి బంధువులు, "పైబోయిన" కుటుంబానికి చెందిన కుర్రాళ్ళు కూడా మరో బృందంగా పాపి కొండలు వెళ్ళడం ప్రారంభించారు. పైబోయిన వెంక ట్రామ్, రఘు, రమేష్, వెంకట్రామయ్య, భాస్కర్ రెడ్డి, రామ్మోహన్, కే.ఎల్., శశిధర్, వంటి వారు ఆ బృందం లో ఉండే వారు. 1988 లో ఈ బృందం లో నేను కూడా చేరాను. మొత్తానికి కైగాల కుటుంబానికి టూరిస్టుల తాకిడి పెరిగింది.
అందరూ స్నేహితులు, బంధువులే!
సత్య నారాయణ, జయలక్ష్మి దంపతులు అందర్నీ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో ఆదరించేవారు. టూరిస్టులు తమ వెంట అవసరమైన సరుకులు,సామగ్రి, వంట పాత్రలు పట్టుకెళ్లే వారు. ఆకస్మికంగా అవసరమైన సరుకూ సామగ్రి కైగాల కుటుంబమే సమకూర్చేది. గోదావరిలో చేపలు పట్టించే వారు. కోళ్ళు, మేకలు కొయించేవారు. ఉప్పు లో వూర బెట్టిన కొండ గొర్రె మాంసం తో కూర చేసి రుచి చూపించే వారు. రాత్రిపూట నెగళ్లు వెలిగించి క్యాంప్ ఫైర్ వేసేవారు. సీజన్ లో కుండెడు జీలుగ కల్లు ను తెప్పించే వారు. అలా పలు విధాలుగా అతిథులకు సేవలు చేసే వారు. "టెలిఫోన్, రేడియో, వార్తా పత్రికలు, లేని కొల్లూరు జీవితానికి బైటి ప్రపంచం నుండి వచ్చే అతిథులే తమకు గొప్ప రిలీఫ్ ఇస్తుంటారని" సత్యనారాయణ గారు అంటుండే వారు. ఎవరి దగ్గరా ఒక్క పైసా కూడా తీసుకునే వారు కారు. అయితే మా "పైబోయిన" కుర్రాళ్ళు మాత్రం అక్కడికి అవసరమైన డీజిల్ ఇంజిన్, మోటార్ పంపు, గ్రైండర్, జనరేటర్, సోలార్ పవర్ ఎక్విప్మెంట్ , మందులు, దుప్పట్లు, వంటి సామగ్రి పట్టుకెళ్ళి సైలెంట్ గా సత్యనారాయణ గారి ఇంటి లో సదుపాయాలు ఏర్పాటు చేసే వారు. వాళ్ళ బృందం లో కాస్త టెక్నాలజీ ప్రయోగాల సరదా ఉన్న శశిధర్ ఒక సొంత తయారీ సెట్ తో సత్యనారాయణ గారి కోసం ఎమర్జెన్సీ టెలిఫోన్ సౌకర్యం కల్పించాడు. అది ఒకో సారి పని చేస్తుంది. ఒకోసారి పని చేయదు. మొత్తం మీద ఏదో ఒక ఫోన్ అయితే అక్కడ పెట్టారు.
పర్యాటక పితలాటకం:
డబ్బు అనే మాటకు తావు లేకుండా, ఎవరి దగ్గరా ఏమీ ఆశించకుండా, దశాబ్దాల తరబడి, ఇంటికి వచ్చిన వారికల్లా ఆతిథ్యం ఇచ్చి కైగాల కుటుంబం ఆనందించింది.వారిని టూరిజం రొంపి లోకి దింపింది ఒకరకంగా మేమే. ప్రతి ఏటా పాపికొండలు వెళ్లి కొల్లూరు లో మకాం పెట్టి, రోజుల తరబడి మేం ఉండే వాళ్ళం. అక్కడి కొండలు, గుట్టలూ ఎక్కే వాళ్ళం. అడవుల్లో కొత్త దారులు వెతుక్కుంటూ వెళ్లి దారి తప్పి పోయే వాళ్ళం. దారంటూ లేని పాములేరు ప్రవాహం వెంబడి అప్ స్ట్రీమ్ లో నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం. గోదావరి లో ఈత కొట్టే వాళ్ళం! చిన్న పాటి మర పడవ నడుపుతూ గోదావరిలో అటూ ఇటూ సంచారం చేసేవాళ్ళం!
(నా ప్రొఫైల్ పిక్ చూడచ్చు.)
చేపలు పట్ట డానికి వెళ్ళే జాలర్ల వెంట పడి వెళ్ళే వాళ్ళం! ఈ తరహా కాలక్షేపాలు చాలా చేసే వాళ్ళం. అలా 2000 సంవత్సరం లో ఒకసారి కుటుంబ సభ్యులతో వెళ్లిన సందర్భంలో మా బృందం నుంచే టూరిజం రిసార్ట్ ఆలోచన పుట్టింది. టూరిస్ట్ కేంద్రంగా కొల్లూరు ను ఎలా అభివృద్ధి చేయవచ్చో సత్యనారాయణ గారికి నూరి పోసిన వ్యక్తి సింగరేణి వెల్ఫేర్ ఆఫీసర్ పి.శ్యామ్ సుందర్ రెడ్డి. ఆయన నాకు చిరకాల మిత్రుడే కాకుండా నా భార్య రాధారాణి కి స్వయానా అన్నగారు కూడా! ట్రెక్కింగ్ లు, టూర్లు, అంటే ఆయనకు ఎంతో మక్కువ. మేం అంతా యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లో సభ్యులం. అందుకని చాలా ప్రోగ్రామ్స్ లో కలిసి పాల్గొంటూ ఉంటాం! శ్యామ్ ఎంత ప్రయత్నించినా సత్యనారాయణ గారు, జయ లక్ష్మి గారు వ్యాపారానికి ససేమిరా అంగీక రించలేదు. 2001 లో శ్యామ్ ఒక సారి టెంట్లు, బెడ్లు, బెడ్ షీట్లు, షామియానాలు, వంటి క్యాంపింగ్ సరంజామా తో కొల్లూరు లో దిగారు. తర్వాతి వారం సింగరేణి అధికారులను ఒక బృందం గా తీసుకు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. అన్నట్టు గానే తర్వాతి వీకెండ్ కు శ్యామ్ తో ఒక బృందం వచ్చింది. అలా కొన్ని వారాల పాటు టూరిస్ట్ బృందాలను ఆయన పాపికొండల కు తరలిస్తూనే వచ్చారు. దానికోసం ఒక లాంచీ ని పర్మనెంట్ గా తీసేసుకున్నారు కూడా! కొత్త ఆలోచన వస్తే చాలు వెంటనే రంగం లోకి దిగిపోయే ఉత్సాహ వంతుడు, ఓపిక కలిగిన పని మంతుడు, నా తోడల్లుడు కంఠం రాజశేఖర్ రెడ్డి కూడా శ్యామ్ కు తోడుగా రెడీ అయి పోయారు. వాళ్ళిద్దరికీ అదో సరదా వ్యాపకం! కొత్త వ్యాపార ఆలోచన ను విజయవంతం చేయాలన్న ప్రయోగోత్సాహం అంతే! దానిలో ఏదో సంపాదించేయాలనే తాపత్రయం వారిద్దరిలో ఏమాత్రం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను! వారిద్దరూ అనూహ్యంగా తెచ్చి పెట్టిన ఆతిథ్యపు బాధ్యతలతో సత్యనారాయణ గారి కుటుంబం అయిష్టంగానే టూరిజం వ్యవహారం లోకి దిగాల్సి వచ్చింది. అయితే అతిథుల తన్మయత్వం, ఆనందానుభూతి, వారిచ్చే గొప్ప ప్రశంసలు, అభినందనలు కైగాల వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దశాబ్ధాల తరబడి సాదా సీదాగా, నెమ్మదిగా, నిశ్శబ్ధంగా కొనసాగుతున్న కొల్లూరు జీవితం ఆకస్మికంగా ఉత్తేజ భరితమయ్యింది. యవ్వనోత్సాహం ఉరకలె త్తింది. అక్కడ సందడి ప్రారంభమయ్యింది. సత్యనారాయణ గారు విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. కొల్లూరు లో గోదావరి తీరం లో ఇసుక తిన్నెల పై బ్యాంబు హట్ లను వేయించారు.
వర్షాకాలం లో మునిగిపోయే ఇసుక తిన్నెల పై వేసిన హట్ లను ప్రతి ఏటా పునర్నిర్మాణం చేయాల్సి వచ్చేది! తొలుత 50 హట్స్ వేశారు. రిసార్ట్ మెల్లిగా వంద కు, ఆ తర్వాత నాలుగు వందల హట్స్ కు పెరిగింది. తర్వాతి కాలంలో ముంపు లేని ఎగువ ప్రాంతం లో కొంత భూమిని గిరిజనుల నుండి కౌలుకు తీసుకొని అందులో హట్స్ వేశారు. టూరిజం శాఖతో వారికి టై అప్ కుదిరింది. 110 హార్స్ పవర్ అశోక్ లేలండ్ ఇంజిన్ తో నడిచే డీజిల్ లాంచీ ల స్థానం లో 600 , 800, హెచ్.పి. ఇంజిన్ ఉన్న విశాలమైన క్రూయిజ్ లు వచ్చాయి. ప్రైవేట్ టూరిస్ట్ ఆపరేటర్ల తో, లాంచీ యజమానులతో కైగాల వారు అవగాహన పెట్టుకున్నారు. ఆయా సందర్భాల్లో ఏవేవో సాంకేతిక సమస్యలు వస్తే వాటి పరిష్కారానికి నా వంతు తోడ్పాటు ఇస్తూ వచ్చాను. నాటి పర్యాటక శాఖ మంత్రి, మా కుటుంబ స్నేహితులు,శ్రీ వట్టి వసంత కుమార్ గారి సమక్షంలో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. బైట ప్రపంచంలోకి వచ్చి చదువుకున్న ఆయన కొడుకులు చేతికి అంది వచ్చారు. కొల్లూరు కు చెందిన ఓ యాభై మంది గిరిజనులకు రిసార్ట్ లో ఉపాధి దొరికింది. పాపికొండల టూరిజం చిత్ర పటం లో కొల్లూరు బాంబూ రిసార్ట్ కు గుర్తింపు వచ్చింది. కైగాల వారి ఆతిథ్యానికి మంచి పేరు వచ్చింది.
నా ఆహ్వానం మేరకు ఏ.పి. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండు సార్లు పాపి కొండలు కొల్లూరు లో కైగాల వారి ఇంటి వద్దనే జరిగాయి. మా "పైబోయిన" కుర్రాళ్ళ బృందం ఈ రెండు సమావేశాల నిర్వహణ లో నాకు పూర్తి తోడ్పాటు ఇచ్చింది. కేవలం దారి చూపించడానికి ఎన్నో కొత్త కొత్త బృందాలతో నేను పలుసార్లు కొల్లూరు వెళ్లాల్సి వచ్చింది. కేవలం సత్యనారాయణ గార్ని చూడటానికి, పరామర్శించడానికి మిత్రులతో కలిసి కొన్ని సార్లు కొల్లూరు వెళ్లాల్సి వచ్చింది. తాడేపల్లి గూడెం వచ్చిన పుడు ఆయన మా ఇంటికి వచ్చి వెళ్ళే వారు. ఆయన వచ్చిన విషయం తెలిసి ఒక్కోసారి దర్శిపర్రు వెళ్లి ఆయన్ని చూసేవాళ్ళం.
పర్యాటక అభివృద్ధి తెచ్చిన పర్యావరణ విధ్వంసం:
"పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తో పాపి కొండలు కను మరుగు" అంటూ ఒక సారి "ఈనాడు" మొదటి పేజీ బ్యానర్ స్టోరీ చేసింది.దాంతో పర్యాటక విస్ఫోటనం సంభవించింది. ప్రతి రోజూ వేలాది మంది పర్యాటకులు తరలి రావడం మొదలయ్యింది.వారు గోదావరి నదిని, నదీతీరాన్ని ఘోరంగా ప్లాస్టిక్ మయం చేసి పారేశారు. చెత్త తో నింపేశారు.నిషేధం ఉన్నా సరే మద్యం తెచ్చుకుని, తాగి, సీసాలు పగుల గొట్టి, తీరం లో గుట్టలుగా పారేయడం మొదలు పెట్టారు. లాంచీ లలో హైడెసిబుల్ వాయిస్ తో మ్యూజిక్ పెట్టీ అభయారణ్యం ప్రశాంతతకు తీవ్రంగా భంగం కలిగిస్తూ వచ్చారు.సుమారు ఓ యాభై లాంచీలు, పెద్ద పెద్ద క్రూయిజ్ లు రణగొణ ధ్వనులతో నదిలో నిరంతరం సంచరిస్తూనే ఉన్నాయి. టూరిజం డబ్బు పై ఆశతో చాలా మంది కొత్త కొత్త ప్రదేశాల్లో అనుమతులు లేకుండా రిసార్ట్ లు పెట్టేశారు.సేవల నాణ్యత నాశనం అయి పోయింది.నిర్వాహకులకు టూరిస్ట్ లకు వివాదాలు పెరిగి పోయాయి. ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి.ప్రభుత్వం కూడా టూరిజం నుండి ఆదాయం మరిగింది.గిరిజనుల మధ్య పోటీ పెట్టి, వేలం వేసి రిసార్ట్ లకు అనుమతి ఇవ్వడం ప్రారంభించింది. పంచాయితీలకు చెల్లించాల్సిన ఫీజును లక్షలు లక్షలకు పెంచేశారు.అనుచిత పోటీలో వ్యాపారం దెబ్బ తినేసింది.దాంతో సేవల నాణ్యత మరింత దిగజారింది.వినోదం కాస్తా విధ్వంసం గా మారింది.2019 లో నదిలో లాంచీ ప్రమాదం జరిగి 60 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.దాంతో ఏడాది కాలంగా టూరిజం నిలిచి పోయింది. టూరిస్టులు లేరు. లాంచీలు లేవుటూరిజం ఎప్పటికి రివైవ్ అవుతుందో ఎవరూ చెప్ప లేక పోతున్నారు.మా అబ్బాయి అనురాగ్ పెళ్లిని 2019 డిసెంబర్ లో కొల్లూరు లో చేయడానికి ఆరు నెలల ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే లాంచీ ప్రమాదం జరిగాక నదీ ప్రయాణం పై ప్రభుత్వం విధించిన నిషేధం వల్ల మా ప్రణాళిక మార్చుకోవాల్సి వచ్చింది.తాడేపల్లి గూడెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ప్రత్యేక వివాహాల చట్టం కింద మా అబ్బాయి పెళ్లి జరిగింది.అనూహ్యంగా ప్రతి ఏటా యాత్రీకుల సంఖ్య లక్షల్లోకి పెరిగి పోవడం కారణంగా తమ కంటి ముందే పాపికొండల ప్రాంతానికి జరిగిన విధ్వంసాన్ని చూసి సత్యనారాయణ గారు చాలా కలత చెందారు. మథన పడ్డారు.ఎంతో బాధను వ్యక్తం చేసారు. ఇన్నేళ్లుగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ లేదనకుండా ఆనందంగా ఆతిథ్యం ఇవ్వటమే తెలిసిన సత్యనారాయణ గారి కుటుంబానికి ఆతిథ్య వ్యాపారం లోకి దిగడం ఆవేదననే మిగిల్చింది.
1920 నుండి తండ్రిగారు కొల్లూరు లోనే కాపురం ఉన్నా, సత్యనారాయణ గారు అక్కడే పుట్టినా,వారు స్థానికులే నని గుర్తించడానికి అధికారులు సవాలక్ష ఇబ్బందులు పెట్టారు.రిసార్ట్ ను ఇష్టా రాజ్యంగా ఉచితంగా వాడుకున్నారు.లంచాలు, మామూళ్లు గుంజారు. అయినా చిత్ర విచిత్రమైన కేసులు పెట్టారు.ఒక మర్యా దస్తుడైన పెద్ద మనిషి తో చాలా అమర్యాదగా, అనాగరికంగా వ్యవహరించారు.కొందరు పర్యాటకుల దురుసు ప్రవర్తన ఆయనకు తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది. "ఇందులోకి దిగి తప్పు చేసామేమో" అని ఒకటి రెండు సార్లు నాతో అన్నారు కూడా!"కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు లెండి, మీరు వర్రీ కావద్దు" అని మాత్రమే అనగలిగాను. భవిష్యత్తు లో పాపి కొండలు పర్యాటకం గురించి మాట్లాడాల్సిన అన్ని సందర్భాల్లోనూ కైగాల సత్యనారాయ గారిని గురించి మాత్రం తప్పనిసరిగా స్మరించుకోవాల్సి ఉంటుంది. చిరకాలం గుర్తుంచుకో దగిన గొప్ప మనసున్న మనిషి ఆయన. ఆయనకు శ్రద్ధాంజలి.